శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది.కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది. కృష్ణజయంతి, శ్రీ జయంతి అనికూడా పిలువబడుతోంది.
శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కారాగారంలో మేనమామ గండాన జన్మించాడు.
కృష్ణాష్టమినాడు అభ్యంగన స్నానమాచరించాలి. తులసీదళాలు వేసిన నీటితో ఆచమించాలి. ఈరోజు ఉపవాసముండాలి. సాయంత్రం గృహమధ్యమున గోమయంతో అలికి రంగవల్లి తీర్చాలి. దానిమీద బియ్యం పోసి మంటపం ఏర్పరచి నూతన కుంభం ఉంచాలి. ఆ కొత్త కుండను గంధపుష్పాక్షతలచే అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమ ప్రతిష్టించాలి. ముందుగా దేవకీదేవి ప్రార్థనం, తర్వాత కృష్ణప్రార్థన. వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవకీదేవికి నివేదనం చేయాలి. కొన్ని ప్రాంతాలలో దీనిలో శొంఠి కూడా కలుపుతారు. అర్థరాత్రి వరకు పూజ. పాలు, పెరుగు, వెన్న కృష్ణునికి నైవేద్యం. చంద్రోదయ సమయాన బయలు వెడలి అచ్చట అలంకృతమైన భూమియందు ఫలపుష్పచందన సంయుక్తమైన శంఖంచేత నీటిని గ్రహించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ రాత్రి భగవత్కథలచే జాగరణం, మరునాడు భోజనం.
మాతృహృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది.శ్రీ కృష్ణుని బాల్యచేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజా భాజనం చేసే పర్వదినమిది. పాపపుణ్యాల వాసనేలేని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి
కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా కృష్ణపాదాలు చిత్రిస్తారు..కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్యక్రీడలయిన ఉట్లమీది పాలు, పెరుగు, వెన్న దొంగిలించుటను అనుకరించే,జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు. ఈసమయంలో కృష్ణలీలలు పాడతారు. కొన్ని చోట్ల కృష్ణజననం,దధిమథనం, రాసక్రీడ మొదలయిన నాటక ప్రదర్శనాలు ఏర్పాటు చేస్తారు.
అందరి ఇళ్ళనూ ఆ బాలకృష్ణుడు ఆనందమయం, ఆరోగ్యమయం చేయాలని మనస్పూర్థిగా కోరుకుంటూ….మీ చిలమకూరు విజయమోహన్.