కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు, కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చికము, నీచ క్షేత్రము వృషభము, మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు, పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్యత ఉన్న ప్రదేశం అంతర్వేధి.ధాన్యము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి. జంతువులు కుక్క, పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నేరు వేరు, సమిధలు దర్భ. దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ వాహనం గ్రద్ద, రత్నము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.
1. కారకత్వము
కేతువు కుటుంబ సభ్యులలో తాత(తల్లికి తండ్రి)ను సూచిస్తాడు. కేతువు దైవోపాసన, వేదాంతం, తపస్సు, మోక్షము, మంత్ర శాస్త్రము, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసము, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.
-
వ్యాధులు :- అజీర్ణం, స్పోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యము, జ్వరము, వ్రణములను సూచిస్తాడు కేతువు ఏగ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగుటలో సమస్యలు సృష్టిస్తాడు. ఇతడు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడౌతాడు.
2. రూపము
కేతువు పార్ధివ నామసంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు గోత్రం జైమినీ పైఠీనస. కేతువు బూడిద(బూడిద)వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుండి అనేక వ్యాధులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది. బ్రహ్మ ఆజ్ఞానువర్తి అయి కేతువు ధూమ్ర కేతువుగా సంచరించ సాగాడు. క్షీరసాగర మధన సమయంలో మోహినీ చేతి అమృతం తాగిన తరువాత విష్ణువు చేత పాము తలను ధరింప చేయబడ్డాడు. అప్పటి నుండి కేతువుగా నామధేయం చేయబడి విషు అనుగ్రహం చేత గ్రహస్థితి పొందాడు. కేతువు పత్ని చిత్ర రేఖ. సాధారణంగా కేతువు ఒంటరిగా కుజ ఫలితాలను ఇచ్చినా ఏగ్రహంతో చేరి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. గ్రహస్థానం పొందిన కేతువు విష్ణువుకు అంజలి ఘటిస్తూ ఉంటాడు.
3. పరిహారం
కేతుగ్రహ పరిహార పూజార్ధంగా కంచు ప్రతిమ శ్రేష్టం. అధి దేవత బ్రహ్మ. నైవేధ్యం చిత్రాన్నం, కుడుములు, ఉలవ గుగ్గిళ్ళు. ప్రీతికరమైన తిధి చైత్ర శుద్ధ చవితి. ఆచరించ వలసిన వ్రతం పుత్ర గణపతి వ్రతం, పారాయణం చేయవలసినది శ్రీ గణేశ పురాణం, కేతు అష్టోత్తర శతనామావళి, గణేశ శతనామావళి. దక్షిణగా ఇవ్వ వలసిన జంతువు మేక, ధరించ వలసిన రతజ్ఞం వైడూర్యం, ధరించ వలసిన మాల రుద్రాక్ష మాల, ధరించ వలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష. ఆచరించ వలసిన దీక్ష గణేశ దీక్ష. చేయ వలసిన పూజ విజ్ఞేశ్వర పూజ, సూర్యారాధన, దానం చేయవలసిన ఆహార పదార్ధాలు ఖర్జూరం, ఉలవలు. గ్రహస్థితిని పొందిన వారం బుధవారం. మండపం జెండా ఆకారం. గ్రహం బలంగా ఉంటే ఆధ్యాత్మిక చింతన బలహీనమైన అతి భయం కలుగుతుంది.